|
మళ్లీ చదువుకుంటే నాకే ఇట్లా అనిపించింది. ఇది జీవిత చరిత్ర లాగా ఉందన్నారు ఒకరు...... చర్చలు సుదీర్ఘమైనవి అన్నారు కొందరు..... వ్యాసాలుగా ఉన్నాయి అన్నారు మరి కొందరు.... అందరి మాట కొంత నిజమే అయి ఉండవచ్చు ఇప్పుడు చర్చల నిడివి కొంత తగ్గించాను. అయినా అవి అనవసరమనిపించలేదు. యథార్థ వ్యక్తుల పేర్లను, కొందరిని ఇంటిపేర్లతో సహా, చలం తిరిగిన స్థలాలను, కాలక్రమంగా సంఘటనలతో సహా వ్రాశాను. అందువల్ల చరిత్రగా అనిపించి ఉండవచ్చు. ఇది జీవిత చరిత్రాత్మక నవల గనుక వాస్తవాలే ఎక్కువగా ఉండకపోతే అప్రమాణికం అవుతుంది. ఇందులో కల్పిత ఘట్టాలు సంభాషణలు ఎన్ని ఉన్నా సందర్భాలు మాత్రం వాస్తవాలే. కథన శిల్పం కోసం సంఘటనలను ముందు వెనుకలు చేయలేదు . అబద్ధాలు కల్పించలేదు. కల్పించిన సంభాషణలు సన్నివేశాలు అన్నీ చలం అంతరంగ పరిణామాన్ని, దృక్పథాన్ని చిత్రించటం కోసం చేసినవే. చలం జీవితంలో బాహ్య పరిస్థితుల వల్ల కలిగిన మార్పుల కన్నా, తనను తాను ప్రశ్నించుకోవడం వల్ల వచ్చిన మార్పులే ఎక్కువ. అందుకని చర్చలు ఎక్కువగా అవసరం అయినాయి. బాహ్య సంఘటనలు ప్రేరణలు మాత్రమే. అతనికి తారసిల్లిన సంఘటనలు వంటివి ఎందరికైనా జరిగి ఉండవచ్చు. కానీ ఈ పరిణామం ఈయనలోనే కలిగింది. ఎవరికైనా అంతరంగ శోధనల వల్లనే మానసిక పరిణామాలు మలుపులు తిరుగుతాయి. అంతదాకా ఎందుకు చలం గారిని ఈ దారి పట్టించిన సీనియర్ విశ్వాసి చింతా దీక్షితులు గారే మధ్యలో ఆగిపోయారు. పిన్న వయస్కురాలైన కూతురు ఇంకా ముందుకు సాగిపోయారు. జీవిత ప్రయాణం అంటే మనోయాత్రే కద! ఒకే సమాజ పరిస్థితులలో సామాజిక పోరాట వీరులు కూడా నలుగురు నాలుగు విధాలుగా ప్రయత్నించడం లేదా... వారి వ్యక్తిత్వ వైవిధ్యాన్ని చూపేది వారి మార్గ వైవిధ్యమే. ఆతని చిత్త పరిణామాన్ని స్పష్టం చేయటానికి చర్చలు అనివార్యమైనాయి. అవి విస్తారంకాకుండా పరిణామాన్ని స్పష్టంగా చిత్రించడం నాకు సాధ్యం కాలేదు. అందుకని ఇది కథాప్రధానమైన రచన కాదు. చలం బాహ్య జీవితక్రమాన్ని చెప్పే కొన్ని పుస్తకాలు ఇప్పటికే వచ్చేసాయి. ఎవరి దృష్టితో వారు చిత్రించారు. విమర్శించారు. ఇంకా రావచ్చు. ఎన్నైనా రాదగిన వాడే................................... ----- ఉమామహేశ్వర పశ్వర అయ్యర్ |