వజ్రం
పచ్చని ప్రకృతిని చుట్టూ అల్లుకున్న ఒక అందమైన గ్రామం వజ్రపురం.
ప్రొద్దు గుంకే సమయం
గోధూళివేళ కాసింత అలసిన సూరీడు కూసింత విశ్రాంతి కోసం పడమటింటకు మరులుతున్నాడు. ఆకాశం కెంజాయవర్ణాన్ని సంతరించుకుంది. నీరెండ కిరణాలు బంగారురంగుతో భూమిని తాకుతున్నాయి.
ఆలమందలు తమ గిట్టలను తాటిస్తూ తమ తమ ఇండ్లకు బయలుదేరాయి. వాటి మెడలలో కట్టిన మువ్వలు చిరు శబ్దం చేస్తూ వాటి రాకను తెలియచేస్తున్నాయి. వాటి గిట్టల నుండి రేగుతున్న గోధూళి పశ్చిమాన్ని ఎరుపెక్కిస్తోంది. వింత మట్టివాసన ఆహ్లాదాన్ని గొలుపుతుంది.
ఆహారం కోసం వెళ్లిన పక్షులన్నీ తమతమ గూళ్ళకి చేరుకుంటున్నాయి.
దూరంగా రామాలయంలో మైకు సెట్టులో దేవుడి పాటలు వినిపిస్తున్నాయి. చల్లటి గాలి అల్లనల్లనగా అందరిని పలకరిస్తోంది. కొందరు ఆవులకు పాలు పితకడం మొదలుపెట్టారు. మరికొందరు రామాలయం వైపుగా వెళ్తున్నారు. కొందరు మేకల గుంపులను తోలుకొస్తున్నారు........................