భారతదేశంలోని భక్తి ఉద్యమాలు
భారతదేశంలో క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి భక్తితత్వం కన్పిస్తుంది. వాసుదేవ, నారాయణ, శివ మొదలగు ఏక దేవతారాధనలు అనాటి మతంలో ఉన్నాయి. భక్తి ఉద్యమాలు అన్ని మతాలను ప్రభావితం చేసాయి. ప్రధానంగా మధ్య యుగాల్లో భక్తి ఉద్యమాలు ప్రాముఖ్యత కన్పిస్తుంది. మతంలో అంతర్గతంగా సంస్కరణ రూపంలో వచ్చిన భక్తి ఉద్యమాలు మన ప్రజాతంత్ర సాంప్రదాయానికి ఎంతగానో తోడ్పడ్డాయి.
భక్తి ఉద్యమకారులు తమ బోధనలను ప్రజల భాషలో ప్రచారం చేయటం మూలంగా ఇవి విస్తృతమైన ప్రచారాన్నిపొందాయి. ఈ ఉద్యమాల్లో వ్యక్తి సంస్కార వాదం ప్రాముఖ్యతను వహించింది. ఆయా మతప్రవక్తలు, కవులు, ఆచరణ యోగ్యం కాని కట్టుబాట్లను ఖండిస్తూ కుల మత ఇత్యాది విషయాల్లో సంస్కరణలను కాంక్షిస్తూ, భక్తి ప్రాతిపదికగా సామాజిక చైతన్యానికి దోహదం చేశారు. కాబట్టి, ఈ మత సంస్కరణ ఉద్యమాలు అంటున్నాం. అతి తక్కువ కాలంలో ఈ భక్తి ఉద్యమాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి నొంది, జాతీయ సమైఖ్యతకు దోహదం చేశాయి.
భారతదేశంలో 13,14,15,16, శతాబ్దాలో వచ్చిన భక్తి ఉద్యమానికి యూరపులోని సంస్కరణ ఉద్యమానికి ఎంతో సారూప్యం ఉంది. భారతీయ భక్తి ఉద్యమం కేవలం మత ఉ ద్యమం మాత్రమే అనుకోరాదు. సమాజంలోని మానవులు సాంఘికంగా, సాంస్కృతికంగా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఈ ఉద్యమం చర్చకు పెట్టింది. ఒక విధంగా కులవ్యవస్థ ఫలితంగా ఏర్పడిన అసమానతలను తొలగించే ప్రయత్నానికి ఈ ఉద్యమం శ్రీకారం చుట్టింది. భగవంతుని దృష్టిలో మానవులంతా సమానమేనన్న భావం జన సామాన్యాన్ని ఆకర్షించి, బడుగు బలహీన వర్గాలు, కులాలు ఉన్నత వర్గాల అన్యాయ ప్రవర్తనని ప్రశ్నించే ప్రయత్నం చేసింది............................