కళింగనాగు
అర్ధరాత్రి - లోకం చీకటిని ముసుగేసుకుని కునుకు తీస్తోంది. ప్రకృతిలో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. సకల జీవకోటికీ జరుగుతున్న దేమిటో ఆకళింపు కాని పరిస్థితి! కళింగ దివాణంలో సహితం చీమ చిటుక్కుమనడం లేదు. ఈగ రెక్క రొద చేయటం లేదు. దివాణం తాలూకు శయన మందిరంలో నీలితెరలు చిరుగాలికి తరళితమవుతున్నాయి. సర సర.... చర చర పాక్కుంటూ నిలువెత్తు సర్పం మిల మిల మెరిసే కన్నులతో తళుకులీనుతున్న శరీరంతో - శయన కక్ష్యను సమీపించి, చీలిన నాలుకను సుతారంగా ఆడించి, తోకమీద లేచింది. మరంతలోనే గవాక్షం మీదకు ఎగబాకి లోనికి తొంగి చూసింది - క్షణం- రెండు క్షణాలపాటు అలికిడిని గమనించి, లోపలికి జారిపోయింది. నల్లగా నిగ నిగ సర సరా ధగ ధగ, అవసరమయితే భగ భగ, ఆగ్రహిస్తే సెగ సెగ.... పగబడితే విషపు పొగ, పొగ.... సర్పమనే ఈ ప్రాణి అనన్యమైన శక్తి సంపన్న!
వాంసతూలికా తల్పాన్ని బోలిన శయ్యపై రాజేంద్ర భూపతి అకస్మాత్తుగా మేల్కొన్నాడు. మరంతలోనే ఎవరో నిద్ర లేపినట్టు జాగృదావస్థకు చేరి తేరుకున్నాడు. గోడ గడియారం ఠంగ్, ఠంగ్న పన్నెండుసార్లు మ్రోగింది. ఆయన చూపులు దేనినో అన్వేషిస్తున్నట్టు పారాడి ఓ చోట నిలిచిపోయాయి. గది మధ్యలో పద్మాసనం వేసుక్కూ ర్చున్నట్టు ఆ సర్పం ద్యోతకమయింది. మరుక్షణం రాజేంద్ర భూపతి హస్తద్వయం ముకుళితమైంది. అరమోడ్పు కనులతో ఆయన ధ్యానమగ్నమానసు డయ్యాడు. అడుగు వెడల్పులో పడగ విప్పి ఆ పన్నగం నడయాడింది. కన్నులను తారట్లాడించింది రాజేంద్ర భూపతి మోము ఆనంద ప్లావితమైంది! మానసం మధురోహల తరళించింది, హృదయం పరిమళించింది.
ధ్యానం ముగించిన ఆయన నేత్రాలు పూర్తిగా విప్పారినయ్ అప్పటికా సర్పం జర జర మంటూ పాకి, గవాక్ష కవాక్షంలోంచి యిట్టే నిష్క్రమించింది. ఆయన పూర్తిగా జాగృతుడై పక్కకు తిరిగాడు. శయ్యలో సగభాగం మించి ఆక్రమించి..............................