ముందుమాట
దలై లామా టిబెటన్ బౌద్ధుల ఆరాధ్యదైవం. ఆయన కేవలం వారి ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, నడిపించే నాయకుడు కూడా. టిబెటన్ బౌద్ధుల గౌరవమర్యాదలు పొందే ధార్మిక నేతగా దలై లామా తన బోధనలు, మార్గదర్శకత్వం ద్వారా మానవాళికి ప్రేమ, దయ అందిస్తూ తన జాతికి, ప్రపంచానికి చెప్పుకోదగ్గ సేవలందించారు.
దలై లామాను ప్రపంచవ్యాప్తంగా విశ్వాసానికి ప్రతీకగా శాంతిదూతగా భావిస్తున్నప్పటికీ టిబెట్కు స్వయంప్రతిపత్తి కోసం ఆయన చేస్తున్న పోరాటం వల్ల చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో ఆయనకున్న సంబంధాలు ఎప్పుడూ సవాలుతో కూడుకున్నవిగానే సాగుతున్నాయి.
బౌద్ధధర్మాన్ని అనుసరించే జనం హృదయాల్లో దలై లామాకు అత్యంత ఉన్నత స్థానం ఇవ్వడమేగాక ఆయన్ని 'శ్రీమత్' (హిజ్ హోలీనెస్) అని గౌరవంగా పిలుస్తుంటారు. బౌద్ధధర్మానికి సంబంధించి ఆయనను అత్యంత ఆరాధనీయ వ్యక్తిగా బుద్ధుడి తర్వాత అంతటి స్థానం ఇవ్వదగిన బోధకుడిగా చూస్తారు.
దలై లామా శాంతి, కరుణ, అహింసలకు చిహ్నంగా నిలిచి, ఈ ఆదర్శాలను ప్రజలు అనుసరించేలా స్ఫూర్తినందిస్తున్నారు. ఇక ఆధ్యాత్మిక బోధనల పరంగా ఇతర గొప్ప ధార్మిక మార్గదర్శుల మాదిరిగానే ధర్మపథంలో నడవాలంటూ దలై లామా ప్రజలను ప్రోత్సహిస్తూ తద్వారా ప్రజలు అంతిమంగా మరింత ఆనందదాయక, శాంతియుత, జ్ఞానదాయక జీవితం గడపవచ్చనేదే ఆయన విశ్వాసం.
దలై లామా సందేశం, ఆయన ఆచరణాత్మక జీవనం ఎంత విలువైనవీ ఎంత ప్రభావశీలమైనవీ అంటే ఆయన పిలుపునిస్తే లక్షలాది మంది ప్రజలు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ ఆయన తన మాతృభూమికి దూరంగా ప్రవాస జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి దేశాన్ని చైనా ఆక్రమించడంతో ఆయన, ఆయన అనుచరులు స్వదేశానికి తిరిగి వెళ్ళే పరిస్థితులు లేవు.
టిబెట్లో తమ హక్కుల సాధనకు, స్వయంపాలన కోసం దలై లామా టిబెటన్ బౌద్ధులు పట్టువిడవకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. టిబెటన్ బౌద్ధులు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కాలం గడుపుతున్నప్పటికీ తమ ధార్మిక, సాంస్కృతిక, రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టిబెట్ విమోచనానికి చేస్తున్న ఈ ప్రయత్నాలకు దలై లామా కీలకంగా ఉండటంతో ఆయనను, యావత్ టిబెటన్లను చైనా శత్రువులుగా చూస్తోంది....................