జో "గల సరసమ్మ జోబిడీ అదే!” అని చేయి ముందుకు చాపి చూపెట్టాడు. సుధీర్ మట్టిబాటలో రాళ్లగుట్టను చుడుతూ మలుపు తిరిగాక. సుధీర్ తో బాటూ వేగంగా నడవలేక అలసిపోయి గసపోస్తూ తలపైకెత్తి చూసాడుసాయి.
కణకణ లాడే యెండలో, యేకేసిన దూదికుప్పల్లా కనబడుతున్న మేఘాలు వేలాడుతున్న ఆకాశం కింద, వూరు దాటి చెరువు కట్ట పైనుంచీ సాగి, బరాబయలుగా వున్నయెర్రటి బీడుచేన్ల మధ్యలోంచీ పాకి, గుట్టకిందున్న సాహేబులు ఖబరుస్థానుకు సరిహద్దులా కొనసాగిన మట్టి బాటపైన, వాళ్లిద్దరూ తమనీడల్ని తామే తొక్కుకుంటూ నడుస్తున్నారు. చెమటకు తడిసిన ముఖాలకు తెల్లటి దుమ్ము అతుక్కుపోవడంతో వాళ్ళ శరీరాల అసలు రంగేమిటో తెలియడం లేదు. వాళ్ళ జీన్సు పాంట్లూ, టీషర్టులూ కూడా దుమ్ముతో మట్టిరంగులోకి మారిపోతున్నాయి.
బాటకు రెండువైపులా మామిడి తోట్ల కంచెల కివతల పసుపురంగుపూలతో తంగేడు చెట్లు తలలూపుతున్నాయి. కంచెల్లో పెరుగుతున్న బొంతజెముడు, కలబంద చెట్లు నీలుక్కుని నిలబడివున్నాయి.
బాటపైని దుమ్మునంతా జవురుకుని సుళ్ళుతిరుగుతూ పైకిలేస్తున్న సుట్రగాలి.........................