ముందస్తు ముచ్చట్లు
2019వ సంవత్సరం, ఆగష్టు నెల 6వ తేదీన మన భారతదేశ హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు పార్లమెంట్లో ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. అదేమంటే...
"పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత ఆకసాయిచిన్ మన దేశ భూభాగంలోనివి. ఏదో ఒక రోజున ఈ రెండు ప్రాంతాలనూ మన భూభాగంలో కలిపి తీరుతాం.”
ఒక్కసారిగా పార్లమెంట్లో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. 1962 సంవత్సరంలో మనం చైనాకు వశం చేసిన ఆకసాయిచిన్ ప్రాంతం తిరిగి పొందుతాం అన్న ప్రకటనకు మాత్రం ఆ సమయంలో యువతీ, యువకులుగా ఆ ఘటనకు బాధపడిన ఈనాటి వయోవృద్ధులు మాత్రం మిక్కిలి సంతోషపడ్డారు. ఈ శుభ సందర్భాన్ని వారు వీక్షించే అవకాశాలు తక్కువైనా భావితరాల దేశప్రేమికులు తప్పక సొంతం చేసుకుంటారని ఆకాంక్షించారు.
1961వ సంవత్సరం గుంటూరు లీలామహాల్లో మేము “ద గన్స్ ఆఫ్ నేవరోన్" అనే ఆంగ్ల చిత్రాన్ని చూశాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సైనికులు కొంతమంది బ్రిటీష్ సైనికుల్ని గ్రీసు దేశంలోని నేవరోన్ అనే నగరంలో బంధిస్తారు. వారిని విడిపించడానికి ఒడంబడిక మిత్రదేశాలైన బ్రిటన్, అమెరికా, రష్యా మొదలైన వాటికి కేవలం వారం రోజుల వ్యవధి మాత్రం మిగిలి ఉంటుంది. అక్కడికి చేరాలంటే కేవలం సముద్రమార్గంలోనే ప్రయాణించాలి. కానీ, సముద్రాన్ని ఆనుకొని వున్న ఒక కొండ గుహలో జర్మన్ సైనికులు అమర్చిన రెండు భారీ శతఘ్నులు మిత్రదేశాల ప్రయత్నాలను అడ్డుకుంటాయి. వారి యుద్ధనౌకలపై గుళ్ళ వర్షం కురిపించి, వాటిని నాశనం చేస్తుంటాయి....................