మొదటి ఉత్తరం
ప్రియమైన శాఫో,
పొద్దుణ్ణుంచీ నీచుట్టూతానే నా తలపులు. కాని ఎక్కడ మొదలు పెట్టాలో, ఏమని సంబోధించాలో, ఏమి రాయాలో తెలియడం లేదు. నా పాతికేళ్ళప్పుడు ఎన్ని ఉత్తరాలు రాసేవాణ్ణి. జవాబులు రావని తెలిసినా కూడా రాస్తూనే ఉండేవాణ్ణి. అప్పుడు నువ్వెక్కడున్నావు? అప్పుడప్పుడే నీ కౌమారంలో అడుగుపెడుతూ ఉండేదానివేమో. ఒడెస్యూస్ ఎలైటిస్ రాసుకున్నట్టుగా ఆ ఏజియన్ సముద్రపు గాలుల మధ్య ఆ ఈవొలిన్ గ్రీకులో తొలికవితలు అల్లుకుంటూ ఉండేదానివనుకుంటాను. ఆయన రాసుకున్నట్టే నువ్వు బహుశా నీ కవితల పుస్తకం ఎవరికీ చూపించేదానివి కాదేమో.
పాతికేళ్ళకింద నిజంగానే నేను నీ వంటి స్నేహితురాలి కోసం వెతుక్కుంటూ ఉన్నాను. బహుశా నీకప్పుడు పాతికేళ్ళ వయసుండవచ్చు. మైటిలేని పట్టణం శివార్లలో ఆలివు తోటల్లో నీ చెలికత్తెలకు పెళ్ళిపాటలు నేర్పుతూ ఉండేదానివనుకుంటాను. నా ఊహల్లో కదలాడే ఆ మిత్రురాలు అచ్చం నీలానే ఉండేదనిపిస్తుంది. చేతిలో ఒక తంత్రీవాద్యం, పెదాలమీద ఒక ప్రేమగీతం, చుట్టూ నిన్ను ఆరాధించేవాళ్ళు, నువ్వు ఆరాధించేవాళ్ళు, పట్టలేనంత ప్రేమలు, అలకలు, అసూయలు- నీకు తెలుసునా? అప్పట్లో నాక్కూడా ఒక ప్రేమజ్వరం, నీ మాటల్లో చెప్పాలంటే limb-loosening love, దేహాంగాల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మోహోన్మాదంలో ఉండేవాణ్ణి.
ఏమైతేనేం, ఇన్నాళ్ళకు సాహసం చేసి ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు తెలుసు, ఇప్పటికి నువ్వు సిరక్యూజ్ నగరం నుంచి నీ ప్రవాసం నుంచి వెనక్కి వచ్చి ఉంటావు. మైటిలెని నగరంలో మళ్ళా ఆ దానిమ్మతోటల మధ్య, ఆ ఆలివ్ చెట్ల నీడల్లో, ఆ పైన్...........................