సీమపందుల పెంపకం - ప్రాముఖ్యత - గణాంకాలు
మనదేశంలో సీమపందుల పెంపకం రోజురోజుకు వృద్ధి చెందుతున్నది. అనాదిగా బలహీన వర్గాలవారికి, గిరిజనులకు జీవనోపాధిగా ఉన్న పందుల పెంపకం, నేడు ఔత్సాహకులకు ఉపాధి మార్గంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న జనాభా మాంసకృత్తుల అవసరాలు తీర్చడానికి, తగిన మాంసోత్పత్తి పందుల పెంపకంద్వారా వీలవుతుంది. అలాగే దేశవాళి పందుల పెంపకంకు ప్రత్యామ్నాయంగా శ్రేష్ఠమైన విదేశీ, సంకరజాతి పందులతో, ఫారాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో పెంచాల్సిన అవసరం ఉంది.
పందుల్ని మొదటిసారి మధ్య తూర్పు మధ్యదర సముద్రం ప్రాంతంలో 7-9 వేల సం॥ల క్రితం మచ్చిక చేసుకుని పెంచుకున్నారు. చైనా, రష్యా, అమెరికా, బ్రెజిల్, పశ్చిమ జర్మనీ మొ||నవి ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పంది మాంసోత్పత్తి చేస్తున్న దేశాలు. మనదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో పందుల్ని ఎక్కువగా, బలహీనవర్గాలవారు పెంచుతున్నారు. దేశంలోని పందుల్లో, 28% పందులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలాగే కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పందుల పెంపకం ఉంది. మనదేశంలో అత్యధిక సంఖ్యలో పందుల్ని పెంచే రాష్ట్రం, అస్సాం.