పరిచయం
నా కథ
41 సంవత్సరాల వయస్సులో, నా కళ్ల ముందు $800,000 అప్పు కనబడుతూ - వుంది. ఉద్యోగం లేదు. నా భర్త రెస్టారెంట్ వ్యాపారం ఒడిదుడుకుల్లో పడిపోవడం మొదలైంది. అప్పుల బాధ నుంచి తప్పించుకోలేక జీవితంపట్ల ఇసుమంతైనా ఆశ లేకుండా పూర్తిగా నిరాశలో కూరుకుపోయానని అనిపించింది.
ఇంట్లో సరుకులు కొనుక్కునేందుకు కూడా మేము ఎంతో కష్టపడుతుంటే, నా స్నేహితులు మాత్రం వారి కెరీర్లో వరుస విజయాలు సాధించడం నాకు చాలా అసూయ కలిగించింది. సరిగ్గా అప్పుడే నా ఉద్యోగం కూడా పోయింది. నా జీవితాన్ని ఏ విధంగా నడపాలో నాకు అర్థం కాలేదు: న్యూయార్క్ నగరంలోని లీగల్ ఎయిడ్ సొసైటీకి పబ్లిక్ డిఫెండర్గా ఉండటానికి ప్రయత్నించాను. బోస్టన్లో ఒక పెద్ద సంస్థలో న్యాయవాదిగా వున్నాను. కొన్ని స్టార్టప్లలో పని చేసాను. వ్యాపార ప్రకటనలు చేసే అడ్వర్టైజింగ్ ఏజెన్సీల్లో పని చేసాను. కొంతమందికి కోచ్గా మారాను. కాల్-ఇన్ రేడియో షోను నిర్వహించాను. పూల కుండీలపై పెయింటింగులు వేసే చిన్న స్టూడియో కూడా ప్రారంభించాను. ఇన్ని చేసినప్పటికీ, నేను సర్వం కోల్పోయినట్లు భావించాను. అప్పుల ఊబిలో నుండి బయటపడేందుకు ఏం చేసినా అది ఏ మాత్రం సరిపోదు అనే స్థితిలో నేనున్నాను.
ఆందోళనల నుంచి, అనేక అనుమానాల నుంచీ తప్పించుకు తిరగడమే మంచి మార్గంగా భావించాను. ఎటువంటి పనైనా 'చేయకుండా వదిలిపెట్టడం' మంచిదనుకున్నాను. లేదంటే మద్యం తీసుకుని అన్ని బాధలూ మరిచిపోవడం మంచిదనుకున్నాను. నా భర్తను నిందించడం ద్వారా బాధ్యత నుండి తప్పించుకోవచ్చు. ఉద్యోగం గురించి వెతుక్కోవడం కూడా వాయిదా వేయడం మంచిదనుకున్నాను.
ఇలాంటి స్థితిలో మీరు ఎప్పుడైనా ఉన్నట్లయితే, చాలా తేలికపాటి పనులు కూడా ఎంత భారంగా అనిపిస్తాయో మీకు అర్థమవుతుంది. మంచం నుండి నిద్రలేవడం, చెల్లించవలసిన బిల్లులు చూసుకోవడం, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, వంట చేయడం, ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోవడం, నడకకు వెళ్లడం, మీరు ఎంత కష్టపడుతున్నారనే దాని గురించి నిజాయితీగా ఉండటం యిలా ప్రతిదీ అసాధ్యం అనిపిస్తుంది. ప్రతి ఉదయం నేను.....................