మరో దేశంలో
ఆ శరదృతువులో యుద్ధం ఎప్పుడూ మా చుట్టూతా ఉండేది. అయితే మేం మాత్రం ఇక యుద్ధానికి వెళ్ళడం లేదు. మిలన్ నగరంలో అప్పట్లో చలి బలంగానే ఉండేది. చీకటి కూడా త్వరగా పడిపోయేది. వీధి దీపాలు వెలగగానే, కిటికీల్లోంచి బయట వీధులను చూడటం చాలా బాగుండేది. దుకాణాల బయట వేలాడదీసిన వేటాడిన జంతువుల చర్మాల మీద మంచు పడేది. గాలికి వాటి తోకలు ఊగేవి. ఆ చలికి జింకలు బిగుసుకుపోయి భారంగా కనిపించేవి. చల్లని గాలి కొండల మీద నుండి వీస్తూండేది.
ప్రతిరోజూ మధ్యాహ్నం మేమంతా హాస్పిటల్కు వెళ్ళేవాళ్ళం. ఊరి నుండి అక్కడికి వెళ్ళడానికి రకరకాల దారులు ఉండేవి. కాల్వల పక్కన ఉండే రెండు దారులు చాలా పొడవుగా ఉండేవి. ఏ దారిలో వెళ్ళినా, ఆసుపత్రికి చేరుకోవాలంటే ఏదో ఒక వంతెన దాటాల్సిందే. మొత్తం మూడు వంతెనలు ఉండేవి. అందులో ఒక వంతెన మీద ఒకావిడ వేయించిన గుగ్గిళ్ళు అమ్ముతుండేది. ఆమె వద్ద ఉండే మంట దగ్గర నిలబడితే వెచ్చగా ఉండేది. గుగ్గిళ్ళను జేబులో వేసుకుంటే ఆ వేడి కాస్తంత హాయినిచ్చేది.
ఆ ఆసుపత్రి చాలా పాతది, చూడటానికి అందంగా ఉండేది. ఒక గేటుగుండా లోపలికి వెళ్ళి, ప్రాంగణం దాటి మరో పక్కన ఉన్న గేటు నుండి బయటకు వచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు అక్కడ శవయాత్రలు జరుగుతూండేవి. పాత ఆసుపత్రి దాటగానే...............................