యాత్ర
ప్రభు ఎంత చెప్పినా మీరా వినిపించుకోలేదు.
లతా, నీరజా చిరునవ్వుతో రెండుచేతులు కట్టుకుని, "కమింగ్ ఎట్రాక్షన్స్” ఫోటోలు చూస్తూ మధ్య మధ్య తమవైపు చూస్తున్నారు.
ఇక రెట్టించడం బాగుండదనుకొని డబ్బు జేబులో ఉండనిచ్చాడు ప్రభు. అప్పటికే ఒకళ్ళిద్దరు తమవైపే విచిత్రంగా చూసినట్లనిపించి, పైగా లతా, చేతులు కట్టుకుని నవ్వుతూ వినోదం చూడటంతో సిగ్గువేసింది.
ఇదంతా గమనించినట్లు లేదు మీరా. సన్నటి కళ్ళద్దాల ఫ్రేమ్ నుంచి వింతగా థియేటర్ లోని బొమ్మలనూ, సినిమా చూడటానికి వచ్చినవాళ్ళనూ, కాంటీన్ కౌంటర్ మీద అమర్చిన పురాతన కేక్ పేస్ట్రీలనూ, వాటినే ఎంతో ఆసక్తిగా కొనుక్కుంటూన్న అర్ధనారీ అవతారమూర్తుల్లాంటి సెమీ హిప్పీలనూ అంటీముట్టనట్లు గమనిస్తూంది.
నాలుగు టిక్కట్లు లత చేతిలో వుంచి కాంటీన్ వైపు నడిచాడు ప్రభు. నెమ్మదిగా ఒకరొకరు సినిమాహాల్లోకి వెడుతున్నారు.
"అక్కా! పద, వెళదాం. ఆ మసకచీకట్లో సీట్లు వెతుక్కుని కూచోవద్దూ" అన్న.
"ప్రభు ఏదో తేవడానికి వెళ్ళినట్టున్నాడు. మనం లోనికి వెళ్ళాం పద” అన్నది నీరజకూడా.
“మీరు పదండి” సౌమ్యంగా నవ్వి లత చేతుల్లోనుంచి రెండు టిక్కట్స్ తీసుకుంది మీరా.
తన తెలివితక్కువకి నాలిక కొరుక్కున్నది నీరజ. లతతో కలిసి థియేటర్లోనికి నడిచారు. లింటాస్ వాళ్ళ లైఫ్బయ్ యాడ్ నడుస్తూంది...........................................